వచ్చే రెండేళ్లలో హౌస్ సైట్లు – లబ్ధిదారులకు శుభవార్త :
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు తీపికబురు చెప్పింది. వచ్చే రెండేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్లు సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామన్నారు. జిల్లాల్లో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలో ఇళ్లు స్థలాలు ఇవ్వాలని.. ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి ఇస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని కాలనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. ఆయా కాలనీల్లో ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నవారిని వదిలేసి.. అక్కడ స్థలం వద్దుకునేవారి స్థలాలు రద్దు చేయాలని సూచించారు. అక్కడ కావాలంటే 3 సెంట్లు ఇవ్వాలని.. ఒకవేళ వద్దనే వారికి మరో చోట ఇస్తామన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
2015 నుంచి 2024 మే వరకు మొత్తం 18 లక్షల ఇళ్లకు 7.27 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల ఇళ్లు పూర్తి చేశారని.. టిడ్కో ఇళ్లు కూడా కలిపి 2.50 లక్షలఇళ్ల గృహప్రవేశాలు చేయబోతున్నామన్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం 5.50 లక్షల వరకు ఇళ్లు పూర్తవుతాయన్నారు. మరో 5.27 లక్షల ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయన్నారు. కేంద్రం హౌసింగ్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించిందన్నారు. కాబట్టి ఆలోగా ఇళ్లు పూర్తి చేయాలని సూచించారు.. ఒకవేళ పూర్తి చేయలేకపోతే కేంద్రం నుంచి నిధులు కూడా రావన్నారు. జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తూ ఇళ్లు పూర్తి చేసేలా చొర తీసుకోవాలన్నారు.