April 7, 2026

ఉద్యోగం కోల్పోవడం ఒక వ్యక్తిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీస్తుంది. ఈ సమస్యలను తగ్గించడానికి EPFO తన PF విత్‌డ్రాయల్ నియమాలను సరళీకరించింది. నిరుద్యోగులు ఇప్పుడు తమ PF బ్యాలెన్స్‌లో 75 శాతం తక్షణమే తీసుకోవచ్చు. 12 నెలల పాటు నిరుద్యోగిగా కొనసాగితే, మిగిలిన 25% మొత్తాన్ని పొందవచ్చు.

ఉద్యోగాల కోతలు పెరుగుతున్న ఈ కాలంలో ఉద్యోగులకు ఆర్థిక భద్రత అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో EPFO తన ప్రావిడెంట్ ఫండ్ విత్‌డ్రా నిబంధనలను సవరించి, సభ్యులకు మరింత సులభతరం చేసింది. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయిన సమయంలో తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఈ మార్పులు ఉపయుక్తంగా ఉన్నాయి. సవరించిన విధానం ప్రకారం PF విత్‌డ్రాయల్ వర్గాలను 13 నుంచి కేవలం 3 ప్రధాన విభాగాలుగా తగ్గించారు.

అవి అత్యవసర అవసరాలు, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. ఇందులో నిరుద్యోగం ప్రత్యేక పరిస్థితులు కిందకు వస్తుంది. దీని వల్ల సభ్యులు తమ అవసరానికి అనుగుణంగా సులభంగా విత్‌డ్రాయల్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వెంటనే సభ్యులు తమ PF బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగి వాటా, యజమాని వాటా, అలాగే వడ్డీ మొత్తం కూడా కలిపి ఉంటుంది.

మిగిలిన 25 శాతం మొత్తాన్ని ఒక సంవత్సరంపాటు నిరుద్యోగిగా కొనసాగిన తర్వాత తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం, సభ్యులు తమ మొత్తం పొదుపును ఒకేసారి ఖర్చు చేయకుండా నియంత్రించడం. దీని ద్వారా వారు దీర్ఘకాలంలో పొందే చక్రవడ్డీ ప్రయోజనాలను కోల్పోకుండా ఉండగలరు.

ఇక EPS విషయంలో 10 సంవత్సరాల సర్వీసు పూర్తికాకముందే ఖాతాలోని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పెన్షన్ అర్హత పొందాలంటే కనీసం 10 సంవత్సరాల పాటు నిరంతర కాంట్రిబ్యూషన్ ఉండాలి. మొత్తం మీద ఈ సవరించిన నిబంధనలు ఉద్యోగం కోల్పోయిన సమయంలో సభ్యులకు తక్షణ ఉపశమనం అందించడమే కాకుండా, భవిష్యత్తు ఆర్థిక భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)