ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన స్పష్టత :
రైతులకు బిగ్ అప్డేట్. పీఎం కిసాన్ నిధుల విడుదల పైన స్పష్టత వచ్చింది. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తుండటంతో.. మరో సారి రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. 22వ విడత పీఎం కిసాన్ నిధుల పైన కేంద్ర అధికారులు క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి సమయంలో రైతులకు ఈ నిధులు విడుదల చేస్తారని భావించారు. అయితే, ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది.
కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే, ఫిబ్రవరి 1 న బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్ ఉండే అవకాశం ఉండటంతో.. 8వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో… పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి లో రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.