January 29, 2026

8 కోట్ల మందికి ప్రయోజనం … EPFO 3.0 కీలక ఫీచర్లు

భారతదేశ సామాజిక భద్రతా ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునీకరించే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
( EPFO ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు వేగవంతమైన, మరింత పారదర్శక సేవలను అందించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ఈపీఎఫ్ఓ ( EPFO ) 3.0 ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఇది జూన్‌ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యమైంది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అప్‌గ్రేడెడ్‌ సిస్టమ్ అమలు తుది దశలో ఉందని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.

ఈపీఎఫ్ఓ ( EPFO ) 3.0 ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను యాక్సెస్ చేసే విధానం, తమ ఖాతాలను నిర్వహించే పద్ధతుల్లో మార్పులుంటాయని ఆయన చెప్పారు. దీని ద్వారా ఖాతాదారులకు మరింత వేగవంతమైన సదుపాయం కలగబోతుందని పేర్కొన్నారు.

( EPFO ) ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా రాబోయే మార్పులు..

డిజిటల్ డ్యాష్‌బోర్డులు

యూజర్ ఇంటర్‌ఫేస్‌ ద్వారా నెలవారీ కంట్రిబ్యూషన్‌ను ట్రాక్ చేయవచ్చు. క్లెయిమ్ స్టేటస్‌ను మానిటర్ చేయవచ్చు. బ్యాలెన్స్, వడ్డీ అప్‌డేట్లను రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌ క్లెయిమ్‌

సభ్యులు ఇకపై ప్రాథమిక సేవల కోసం పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులు చాలా సర్వీసులు పొందవచ్చు.

యూపీఐ ద్వారా తక్షణ ఉపసంహరణ

ఈపీఎఫ్ఓ ( EPFO ) 3.0 యూపీఐ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానమై, అత్యవసర సమయాల్లో తక్షణ ఉపసంహరణలను అనుమతిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ వైద్య లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

ఏటీఎంల్లో నేరుగా పీఎఫ్ విత్‌డ్రా

తొలిసారిగా ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేసి యూనివర్సల్ అకౌంట్ నంబర్ ( UAN )ను యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా నగదు ఉపసంహరణకు జాప్యాన్ని తొలగించడం, వినియోగదారుల డబ్బుకు రియల్ టైమ్ యాక్సెస్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

డెత్ క్లెయిమ్‌ల పరిష్కారం

మానవతా దృక్పథంతో ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్‌ల్లో గార్డియన్‌షిప్‌ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించింది. మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తే గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రతి మైనర్ పిల్లవాడి పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. పీఎఫ్‌, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు ఇది వర్తిస్తుంది. కోర్టు ప్రక్రియలు లేకుండా బాధిత కుటుంబాలకు వేగంగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)