January 16, 2026

EPFO auto settlement :

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముందస్తు ఉపసంహరణలకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్‌ పరిధిని ఈపీఎఫ్‌ఓ సవరించింది. ప్రస్తుతం రూ.లక్షగా ఉన్న మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచింది. అంటే రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు త్వరితగతిన సెటిల్‌ కానున్నాయన్నమాట. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్‌ చేసే ఈపీఎఫ్‌ఓ సభ్యులకు దీనివల్ల లబ్ధి చేకూరనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ప్రకటించారు. కొవిడ్‌ సమయంలో ఆటోసెటిల్‌మెంట్‌ విధానాన్ని తొలిసారి ఈపీఎఫ్‌ఓ తీసుకొచ్చింది.

3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి..

ఆటో సెటిల్‌మెంట్‌లో మానవ ప్రమేయం ఉండదు కాబట్టి రూ.5 లక్ష వరకు ఎలాంటి క్లెయిమ్స్‌ అయినా ఇట్టే పరిష్కారం అవుతాయి. ఆటో సెటిల్‌మెంట్‌ అనేది ఐటీ వ్యవస్థతో పని చేస్తుంది. అర్హత ఉండి.. కేవైసీ, బ్యాంక్‌ వ్యాలిడేషన్‌ పూర్తయినట్లయితే ఐటీ టూల్స్‌ పేమెంట్‌ను ఆటోమేటిక్‌గా ప్రాసెస్‌ చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ సమయం అనేది 10 రోజుల నుంచి 3-4 రోజులకు తగ్గతుంది. ఆటో సెటిల్‌మెంట్ల కారణంగా క్లెయిమ్‌ సెటిల్‌మెంట్లలో వేగం పుంజుకుంటుంది.

ఏమిటీ ఆటో సెటిల్‌మెంట్‌?

సాధారణ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ను వేగవంతం చేసేందుకు ఆటో ప్రాసెసింగ్‌ను EPFO తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండా క్లెయిమ్‌లను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్‌మెంట్‌ ముఖ్య ఉద్దేశం. వివాహం, ఉన్నత విద్య, ఇంటి కొనుగోలు చేయడం కోసం ఈపీఎఫ్‌ ఆటో- సెటిల్‌మెంట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. దీని సాయంతో ఇకపై రూ.5 లక్షల వరకు మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్‌ పొందొచ్చు.

ఏయే కారణాలకు పొందొచ్చు

పెళ్లి, విద్య : రూల్‌ 68-K నియమం ప్రకారం.. ఉద్యోగి తన/ కుటుంబసభ్యుల పెళ్లి, పిల్లల విద్య కోసం పీఎఫ్‌లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే EPFO లో చేరి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ అవసరాల కోసం కేవలం మూడుసార్లు మాత్రమే తన PF బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు గరిష్ఠంగా తీసుకోవచ్చు. వివాహం కోసం డబ్బు ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్‌ సభ్యుడు ఆన్‌లైన్‌లో డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. అదే పిల్లల చదువు కోసం అయితే సంబంధిత సర్టిఫికెట్‌ ఇవ్వాలి

వైద్య ఖర్చుల కోసం: ఈపీఎఫ్‌ చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం రూల్‌ 68-J కింద ఈపీఎఫ్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందుకోసం అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. రూల్‌ 68-J కింద కచ్చితంగా ఇన్ని సంవత్సరాల తర్వాతనే నగదు ఉపసంహరించుకోవాలనే నియమేమీ లేదు. ఉద్యోగి ఆరు నెలల బేసిక్‌ ప్లస్‌ డీఏ లేదా జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా (వడ్డీ సహా).. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి వీలుంటుంది. ఈపీఎఫ్‌ ఉపసంహరణ దరఖాస్తు కోసం డాక్టర్‌ సంతకం చేసిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

ఇంటి నిర్మాణం: ఇక రూల్‌ 68-B ప్రకారం చందాదారులు స్థలం కొనుగోలు/ ఇంటి నిర్మాణం కోసం, ఇంటి రిపేర్‌ కోసం పీఎఫ్‌ బ్యాలెన్స్‌లో పరిమితి మేరకు డబ్బు ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్‌లో చేరి కనీసం ఐదేళ్లు పూర్తయి ఉండాలి. రెండుసార్లు మాత్రమే ఈ కారణంతో విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ అవసరంపై ఉపసంహరించుకొనే మొత్తం ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్‌ను ఫైల్‌ చేయడానికి ఫారం 31ని ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)