November 8, 2025

EPFO ఉపసంహరణలు ఇక మరింత సులభంగా ….

Central Board of Trustees ( CBT ) నిర్ణయాలు 
అర్హత కలిగిన నిల్వల నుంచి 100% నూరు శాతం వరకూ తీసుకోవచ్చు.. …ఈపీఎఫ్‌ కనీస నిల్వ 25% శాతం..కనీస నిల్వగా నిర్వహించాలని వెల్లడించింది.

ఈపీఎఫ్‌వో 3.0కు ఆమోదం…

ఈపీఎఫ్‌వో సేవల్ని మరింత సులభం చేయడంతోపాటు కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించేందుకు, పీఎఫ్‌ సర్వీసులను ఆధునికీకరించేందుకు ఈపీఎఫ్‌వో 3.0కు సీబీటీ ఆమోదం తెలిపింది. ఈ విధానాన్ని విడతలవారీగా అమలు చేయాలని నిర్ణయించింది.

ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్‌) నుంచి ఉపసంహరణలను ఈపీఎఫ్‌వో మరింత సులభతరం చేసింది. అర్హత కలిగిన నిల్వల నుంచి నూరు శాతం వరకూ పాక్షిక ఉపసంహరణకు అవకాశమిచ్చింది. గతంలో ఉన్న నిబంధనలు మరింత సరళతరం చేయడంతోపాటు ఉపసంహరణ ఆప్షన్ల సంఖ్యను పెంచింది. అయితే, ఇక నుంచి ఈపీఎఫ్‌ ఖాతాలో అన్ని సందర్భాల్లో 25% చందాను కనీస నిల్వగా నిర్వహించాలని స్పష్టంచేసింది. తద్వారా వేతన జీవుల ఖాతాల్లో ఆ నిల్వలపై మంచి వడ్డీరేటు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించింది. అంటే మిగిలిన 75 శాతాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చన్నమాట. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌(సీబీటీ) పలు నిర్ణయాలకు సోమవారం ఆమోదం తెలిపింది. దీంతో ఏడు కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరనుంది. పాక్షిక ఉపసంహరణల కోసం గతంలో ఉన్న 13 రకాల సంక్లిష్ట నిబంధనలను విలీనం చేసి.. అత్యవసర(అనారోగ్యం, విద్య, వివాహం), ఇంటికి సంబంధించిన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా వర్గీకరించింది. ఈ కేటగిరీల కింద చందాదారులు అర్హత కలిగిన తమ నిల్వల నుంచి 100% వరకు (ఉద్యోగి, యజమాని వాటాతో కలిపి) ఉపసంహరించుకోవచ్చని తెలిపింది. అలాగే అక్టోబరు నెలకు ఈసీఆర్‌ చెల్లింపు గడువు 22 వరకు పొడిగించింది. 

మూడు నుంచి పదిసార్లకు పెంపు… 

  • వివాహం, విద్య కోసం గతంలో సర్వీసు కాలంలో మూడు సార్లకే ఉపసంహరణకు అవకాశం ఉండేది. ఇప్పుడు విద్య కోసం పదిసార్లు, వివాహానికి సంబంధించి ఐదుసార్లు ఉపసంహరించుకోవచ్చు. భవిష్యనిధి నుంచి పాక్షిక ఉపసంహరణ చేసేందుకు కనీస సర్వీసు కాలాన్ని 12 నెలలకు తగ్గించింది. 
  • గతంలో ప్రత్యేక పరిస్థితుల కింద ఉపసంహరణ కోసం సభ్యులు ప్రకృతి విపత్తులు, లాక్‌ఔట్‌/సంస్థ మూసివేత, ఉద్యోగం కోల్పోవడం, రోగాలవ్యాప్తి వంటి కారణాలను స్పష్టంగా చెప్పాల్సి వచ్చేది. చాలా సందర్భాల్లో ఇది క్లెయిం తిరస్కరణకు, ఫిర్యాదులకు దారి తీసేది. ఇప్పుడు ఈ విభాగంలో సభ్యులు ఎలాంటి కారణాలూ చెప్పాల్సిన అవసరం లేకుండానే ఉపసంహరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఈపీఎఫ్‌వో నుంచి ముందస్తు ఉపసంహరణకు తుది సెటిల్‌మెంట్‌ కోసం వేచిఉండే కాలాన్ని గతంలో ఉన్న 2 నెలల నుంచి 12 నెలలకు, ముందస్తు పింఛను నిధి(ఈపీఎస్‌) ఉపసంహరణకు వేచి ఉండే కాలాన్ని 2 నెలల నుంచి 36 నెలలకు పెంచింది.
  • ఆలస్యమైన పీఎఫ్‌ చెల్లింపులపై జరిమానాలను తగ్గించడంతోపాటు ఇతర వ్యాజ్యాల కోసం విశ్వాస్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఆరు నెలలు పొడిగించవచ్చు.
  • ఈపీఎస్‌ 95 పింఛనుదారులకు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌(డీఎల్‌సీ) సేవలను ఇంటి వద్దే అందించనుంది. దీనికోసం ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ)తో ఒప్పందం కుదుర్చుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఒక్కో సర్టిఫికెట్‌కు అయ్యే రూ.50 ఖర్చును ఈపీఎఫ్‌వో భరిస్తుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *