AP Jobs Calendar 2026 :
ఆంధ్రప్రదేశ్ లో 2026 సంవత్సరానికి సంబంధించి Job Calendar విడుదలకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలోని విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరించారు… వీటిలో ఇప్పటిదాకా దాదాపు 99 వేల ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఇంకా 24 శాఖల నుంచి వివరాలు రావాల్సి ఉంది. అవన్నీ కలిపితే దాదాపు 1.30 లక్షల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంటుంది. వీటన్నింటినీ క్రోడీకరించి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..
రెవెన్యూ శాఖలో మొత్తం 13 వేల ఖాళీలు ఉన్నాయి. ఈ శాఖలోని 4,787 ఖాళీలను అధికారులు నిర్ధారించారు. ఇందులో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 వరకు పోస్టులు ఉన్నాయి. ఉన్నత విద్యా శాఖలో 7 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో 23 వేల పోస్టులను నియమించుకునే అవకాశం ఉంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు ఉండగా.. వీటిల్లో 2,600 పోస్టులు నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుండగా.. వీటిలో డీఆర్ పోస్టులు 2,400 వరకు ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖలో 26 వేల వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. మరో మూడు వేల పోస్టులను ఇన్‌సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 1,820 పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.
పాఠశాల విద్యలో బోధన, బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30 వేల వరకు ఉండొచ్చని అంచనా. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖలో 10 వేల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది. ఇక పాఠశాల విద్య శాఖతో సహా దాదాపు 24 విభాగాల్లో ఖాళీల వివరాలను ఇంకా నిర్ధారించలేదు. వీటన్నింటి లెక్కలు తేలితే నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది.