Emergency Location Service :
భారత్‌లోని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దేశంలో ఎమర్జెన్సీ లొకేషన్ సేవలను (ELS) ప్రారంభించింది. పోలీస్, అగ్నిమాపక, వైద్యం వంటి అత్యవసర సేవల విభాగానికి కాల్ లేదా టెక్స్ట్ చేసినప్పుడు ఈ ఫీచర్ ద్వారా మీ లొకేషన్ లభిస్తుంది. ఈ సేవలను పొందాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలతో ఈఎల్‌ఎస్‌ను అనుసంధానించాల్సి ఉంటుంది. తొలుత ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు విభాగం ఈ సేవలను అందిపుచ్చుకుంది.

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఎవరైనా అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేయగానే ఆటోమేటిక్‌గా వారి కచ్చితమైన లొకేషన్ వివరాలు అవతలి వారికి చేరుతాయి. ఏదైనా కారణంతో క్షణాల్లో కాల్ కట్ అయినా లొకేషన్ వివరాలు అందుతాయి. జీపీఎస్, వైఫై, సెల్యులర్ నెట్‌వర్క్ ఆధారంగా ఈఎల్‌ఎస్ పనిచేస్తుంది. 112 లేదా ఇతర ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసినప్పుడు ఈ ఫీచర్ పనిచేస్తుంది. దీనికి అదనపు హార్డ్‌వేర్‌గానీ, యాప్స్ గానీ అవసరం లేదని గూగుల్ స్పష్టంచేసింది. ఉత్తర్‌ప్రదేశ్ మాదిరిగా ఇతర రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్ డివైజులకు ఈ ఫీచర్ పనిచేస్తుందని తెలిపింది. ఈ డేటాను గూగుల్ కలెక్ట్ చేయబోదని గూగుల్ స్పష్టంచేసింది.