EPF ATM withdraw :
ఉద్యోగ భవిష్య నిధికి (EPF) సంబంధించి వచ్చే ఏడాదిలో కీలక మార్పు రాబోతోంది. ఈపీఎఫ్ నిధుల ఉపసంహరణ ఇకపై సులభతరం కానుంది. ఏటీఎంల (ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఐటీ సిస్టమ్స్ అప్‌గ్రేడింగ్ ప్రక్రియ మొదలైందని, వచ్చే ఏడాదికల్లా అందుబాటులోకి రానుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తాజాగా పేర్కొన్నారు. ఇంతకీ ఏటీఎం విత్‌డ్రా సదుపాయం ఎలా పనిచేయనుంది? ఇది ఎంత వరకు ప్రయోజనం?
ఏటీఎం నుంచి పీఎఫ్ విత్‌డ్రా.. ఎలా పనిచేస్తుంది? ప్రయోజనమెంత?
తమ పీఎఫ్ నిధుల ఉపసంహరణకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో చందాదారులకు ఈపీఎఫ్‌ఓ వీలు కల్పిస్తోంది. ప్రత్యేక సందర్భాల్లో గరిష్ఠంగా 90 శాతం వరకు నిధులను తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు, వివాహం వంటి సందర్భాల్లో ఈ నిధులు విత్‌డ్రా చేసుకోవచ్చు. సంబంధిత కారణాన్ని చూపుతూ క్లెయిమ్ రిక్వెస్ట్ పెడితే కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఖాతాలో నిధులు జమ అవుతాయి. గతంతో పోలిస్తే క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో జాప్యం తగ్గినప్పటికీ.. సత్వర ఉపసంహరణకు మాత్రం వీలు కావడం లేదు. ఏటీఎం విత్‌డ్రా సదుపాయం ఈ సమస్యకు పరిష్కారం చూపనుంది.
ప్రయోజనం ఎంత?
- పీఎఫ్‌ను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన లేనివారు ఇప్పటికీ పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త సదుపాయం వల్ల ఆ ఇబ్బంది తప్పుతుంది.
- ఏదైనా అత్యవసర సమయాల్లో నిధులు అవసరమైనప్పుడు వేరే వారిపై ఆధారపడకుండా ఏటీఎం విత్‌డ్రా సదుపాయం ఉపయోగపడనుంది.
- అయితే, భవిష్యత్ కోసం దాచుకున్న డబ్బులను సులువుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తే నిధులు వేగంగా హరించుకుపోయే అవకాశం కూడా ఉందని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
- అత్యవసరాలకు వాడుకుంటే ప్రయోజనమే అయినా.. చిన్నచిన్న అవసరాలకూ ఎడాపెడా వాడేస్తే పీఎఫ్ తాలుకా అసలు ఉద్దేశం దెబ్బతింటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏటీఎం విత్‌డ్రా సదుపాయం ఎలా పనిచేస్తుంది?
- ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రా కోసం ప్రత్యేకంగా డెబిట్ కార్డుల తరహాలో పీఎఫ్ కార్డులు తీసుకొస్తారని తెలుస్తోంది.
- లేదంటే ఈపీఎఫ్ ఖాతాకు తమ బ్యాంక్ అకౌంట్‌ను అనుసంధానం చేసి ఇది వరకే ఉన్న డెబిట్ కార్డు ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కల్పించే అవకాశం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతానికి దీనిపై స్పష్టత లేదు.
- అది కూడా మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు మాత్రమే ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పిస్తారని సమాచారం.