ఉగాదికి జాబ్ క్యాలెండర్:
ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్‌పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది. వివిధ శాఖల్లో మూడేళ్లలో ప్రాధాన్యక్రమంలో భర్తీ చేయాల్సిన 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

సచివాలయంలో శుక్రవారం అన్ని విభాగాల అధిపతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌లో కలిపి 3 వేలు, విశ్వవిద్యాలయాల్లో 1500 సహాయ ఆచార్యుల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఎస్సై, కానిస్టేబుళ్లు కలిపి 3వేలు, ఏఈలు 500, సంక్షేమ వసతిగృహాల వార్డెన్లు 200, అటవీశాఖ పోస్టులు 100, స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు 200, గ్రూపు-1లో 100, గ్రూపు-2లో 500 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేదానిపై స్పష్టత రానుంది.