December 27, 2025

గర్భిణులకు ఏపీ సర్కారు నూతన సంవత్సర కానుక.. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గర్భిణుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యంత్రానికి సుమారుగా 30 లక్షలు ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. జనవరి నుంచి ఈ టిఫా స్కానింగ్ సౌకర్యం ఆయా ఆస్పత్రులలో అందుబాటులోకి తెస్తామని సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

AP Government To set up Tiffa Scan machines in Seven Hospitals

రాష్ట్రంలోని గర్భిణులకు ఏపీ సర్కారు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఏడు ఆస్పత్రులలో టిఫా స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.. రాష్ట్రంలోని ఏడు సెకండరీ ఆస్పత్రుల్లో కొత్తగా టిఫా స్కానింగ్‌ సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒక్కో టిఫా స్కానింగ్‌ మెషీన్ కోసం రూ.30.48 లక్షలు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, పార్వతీపురం, నర్సీపట్నం, నందిగామ, తుని, ఒంగోలు, తెనాలి ఆస్పత్రులలో కొత్తగా టిఫా స్కానింగ్‌ యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఆస్పత్రులలో జనవరి నుంచి గర్భిణిలకు టిఫా స్కానింగ్ సౌకర్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

టిఫా స్కాన్ (Targeted Imaging for Fetal Anomalies) ద్వారా గర్భస్థ శిశువుల్లో లోపాలను గుర్తించవచ్చు. గర్భిణులకు 18 నుంచి 22 వారాల మధ్య ఈ టిఫా స్కాన్ చేస్తారు. గర్భస్థ శిశువులో గుండె, మెదడు, మూత్రపిండాలు, వెన్నెముక వంటివి సరైన రీతిలో అభివృద్ధి చెందుతున్నాయో, లేదోననే విషయాన్ని ఈ స్కాన్ సాయంతో గుర్తించవచ్చు. అలాగే గర్భస్థ శిశువులలో ఏవైనా లోపాలు ఉన్నా గుర్తించడానికి వీలవుతుంది. పుట్టబోయే బిడ్డ ఎదుగుదలను గుర్తించటంతో పాటుగా ఆరోగ్యంగా, లోపాలు లేకుండా పిండం పెరుగుతోందని నిర్ధారించుకోవడం కోసం ఈ స్కానింగ్ చేస్తారు. అలాగే ఏదైనా సమస్య ఉంటే, దానికి ముందుగానే చికిత్స అందించేందుకు వీలవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *