New APY Rules : రైతులకు నెలకు రూ.5000 పెన్షన్.. కేంద్రం కీలక నిర్ణయం.. స్కీమ్‌లో కీలక మార్పులు
రైతులు సహా అసంఘటిత రంగంలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరడం ద్వారా నెలకు రూ. 5000 వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే, తాజాగా ఈ ఏపీవై స్కీమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో చేరే వారు కచ్చితంగా ఈ మార్పులు చేసుకోవాలి. మరి ఆవివరాలు తెలుసుకుందాం.
దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతైన పథకాన్ని అందిస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన ( Atal Pension Yojana ). ఈ స్కీమ్ ద్వారా రైతులు, రైతు కూలీలు, తాపీ పని చేసే వారి వంటి అసంఘటిత రంగంలోని వారికి 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత నెల నెల రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పెన్షన్ అందిస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ స్కీమ్‌లో చేరి తమ చందా చెల్లిస్తున్నారు. అయితే, తాజాగా ఈ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్‌లో కీలక మార్పులు చేసింది కేంద్రం. సబ్‌స్క్రైబర్ రిజిస్ట్రేషన్ ఫారం మార్చినట్లు తెలిపింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు అనేవి సెప్టెంబర్ 30, 2025 వరకే ముగిశాయని, అక్టోబర్ 1, 2025 నుంచి కొత్త ఫారం తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

అటల్ పెన్షన్ యోజన(APY) వివరాలివే..
అటల్ పెన్షన్ యోజన అనేది ఒక సామాజిక భద్రతా స్కీమ్. దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం ఈ స్కీమ్ తెచ్చారు. ఇందులో నెలకు రూ. 1000 నుంచి రూ. 5000 వరకు గ్యారెంటీ పెన్షన్ లభిస్తుంది. ఖాతాదారుకు 60 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి పెన్షన్ లభిస్తుంది. నెలకు రూ. 210 చొప్పున చెల్లిస్తే గరిష్ఠంగా రూ. 5 వేలు వరకు పెన్షన్ పొందవచ్చు. అయితే, కంట్రిబ్యూషన్ ఆధారంగా పెన్షన్ ఉంటుంది. భారతీయ పౌరులు ఎవరైనా ఇందులో చేరవచ్చు. 18 ఏళ్ల వయసు నుంచి 40 ఏళ్ల వయసు వరకు అవకాశం ఉంటుంది. బ్యాంకు లేదా పోస్టాఫీసులో అకౌంట్ కలిగి ఉండాలి. ఆదాయపు పన్ను చెల్లించే వారికి అర్హత ఉండదు.
అక్టోబర్ 1వ తేదీ నుంచి సవరించిన ఏపీవై ఫారం (APY Form) మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం ఆమోదిస్తున్నట్లు ఈ మేరకు పోస్టల్ విభాగం ఆఫీస్ మెమోరండం జారీ చేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) ఇచ్చిన కొత్త మార్గదర్శకాలను అనుసరించి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసినట్లు తపాలా శాఖ పేర్కొంది. ఈ సామాజిక భద్రత పథకంలో చేరడాన్ని మరింత సులభతరం చేయడమే సంస్కరణల ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న రిజిస్ట్రేషన్ ఫార్మాట్‌ను సెప్టెంబర్ 30, 2025 తర్వాత కొనసాగించడం లేదని తెలిపింది. పాత ఫార్మాట్‌ను ఇక సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ప్రోటీన్ (గతంలో NSDL) ఆమోదించదని పేర్కొంది.