
బ్యాంకు ఖాతా మాదిరిగా EPFO చందాదారులు ATM ద్వారా తమ PF విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి EPFO ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నారని ‘మనీ కంట్రోల్’ పేర్కొంది. అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాలను ఉటంకించింది.

ATM నగదు విత్‌డ్రా సదుపాయాన్ని ఈ ఏడాది జూన్ నుంచే అందుబాటులోకి తేనున్నట్లు కార్మికశాఖ తొలుత ప్రకటించింది. ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా సిద్ధం చేసింది. అయితే, విత్‌డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిమితి విధించకపోతే ‘భవిష్యనిధి’ అసలు లక్ష్యం నీరుగారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ బోర్డు దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓకు 7.8 కోట్లమంది చందాదారులు ఉన్నారు. వీరికి చెందిన సుమారు రూ.28 లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్‌ఓ వద్ద ఉంది. అయితే, అత్యవసర సమయాల్లో వ్యక్తుల నగదు అవసరాలను తీర్చడానికి పీఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సిద్ధం చేయడంతో పాటు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు, ఆర్‌బీఐతో కూడా కార్మికశాఖ చర్చిచింది. ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డును సభ్యులకు ఈపీఎఫ్‌ఓ జారీ చేయనుంది. ఏటీఎం కార్డులా ఈ కార్డు పనిచేస్తుంది. ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్‌డ్రాలకు సంబంధించి మరింత స్పష్టత రానుంది.