EPFO అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఆటో రిఫండ్
ఈపీఎఫ్ఓలో ఎవరూ క్లెయిమ్ చేయని మొత్తాలకు (Unclaimed deposits) సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యనిధి సంస్థ వద్ద పోగుబడిన మొత్తాలను ఆయా చందాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తొలి దశలో 7 లక్షల మంది చందాదారులు లబ్ధి పొందనున్నారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్ఓలో సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
31 లక్షల మందికి చందాదారులకు ప్రయోజనం
మొత్తం 31.86 లక్షల ఖాతాలు నిర్వహణలో లేకుండా ఉన్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. ఇందులో రూ.10,903 కోట్ల మేర నిల్వలు ఉన్నాయన్నది అంచనా. ఇందులో 7.11 లక్షల ఖాతాల్లో రూ.1000 మాత్రమే నగదు నిల్వలు ఉన్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. ఈ ఖాతాల్లోని నగదు విలువ రూ.30.52 కోట్లుగా ఉంది. సాధారణంగా మూడేళ్లు పైబడి ఎలాంటి లావాదేవీలు లేని వాటిని నిర్వహణలో లేని ఖాతాలుగా గుర్తిస్తారు. ఇలాంటి మొత్తం ఇన్ ఆపరేటివ్ ఖాతాల్లో కొన్ని 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నాయి.
తొలుత 7 లక్షల ఖాతాలకు నగదు జమ
పైలట్ ప్రాతిపదికన తొలుత 7 లక్షల ఖాతాల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆధార్‌తో అనుసంధానం అయ్యి ఉన్న బ్యాంకు ఖతా, ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్న వివరాల ఆధారంగా ఈ నగదును వేయనున్నారు. దీనికి ఎలాంటి క్లెయిమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్లు గానీ, ఇవ్వాల్సిన అవసరం లేదు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే మిగిలిన 25 లక్షల నిస్తేజ ఖాతాలకు ఆటోమేటిక్ రిఫండ్ విధానాన్ని అనుసరించనున్నారు.