November 8, 2025

EPF చందాదారులకు Alert :

PF withdraw rule -మీ కార్పస్‌ నుంచి సొమ్ము విత్‌డ్రా చేద్దామనుకుంటే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పీఎఫ్‌ నగదు విత్‌డ్రా చేసి ఆ మొత్తం వేరే అవసరాలకు వినియోగిస్తే దానిని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ తాజాగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది.

EPFO ఏం చెప్పింది ?

‘‘తప్పుడు కారణంతో పీఎఫ్ విత్‌డ్రా చేస్తే, ఈపీఎఫ్‌ స్కీమ్‌, 1952 కింద రికవరీ చర్యలు తప్పవు. సహేతుక కారణాలతోనే పీఎఫ్‌ను వినియోగించండి. పీఎఫ్ అనేది జీవితకాల భద్రతా కవచం అని గుర్తుంచుకోండి’’ అంటూ ఈపీఎఫ్‌ఓ ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేసింది. నియమాలకు విరుద్ధంగా విత్‌డ్రా చేస్తే ఈపీఎఫ్‌ స్కీమ్‌ 1952లోని సెక్షన్ 68బీ(11) ప్రకారం.. ఇతర అవసరాలకు వినియోగించినట్లు తేలితే ఆ సభ్యుడు మూడేళ్ల వరకు పీఎఫ్ విత్‌డ్రా చేయలేడు. తీసుకున్న మొత్తం, వడ్డీతో కలిపి తిరిగి చెల్లించే వరకు కొత్త అడ్వాన్స్‌కు అనుమతి ఉండదు.

సాధారణంగా రిటైర్మెంట్ తర్వాత లేదా 58 సంవత్సరాల వయసు పూర్తి చేసిన తర్వాత మాత్రమే పీఎఫ్ మొత్తం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం, పెళ్లి, పిల్లల విద్య, తీవ్రమైన అనారోగ్యం వంటి కొన్ని సందర్భాల్లో మాత్రం పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. వీటికి డాక్యుమెంట్లు, కారణాలు తప్పనిసరి. ఉదాహరణకు ఒకవేళ మీరు ఇల్లు కొనుగోలు కోసం తీసుకున్న డబ్బును వేరే అవసరాలకు వినియోగిస్తే, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే అధికారం ఈపీఎఫ్‌ఓకు ఉంది.

దేనికి ఏ ఫారం వినియోగించాలి.

ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా లేదా పూర్తిగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం.. ఇలా పలు సందర్భాల్లో ఈ ఫండ్‌ నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం వేర్వేరు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఫారం-19 వినియోగించాల్సి ఉంటుంది. పెన్షన్‌ విత్‌డ్రాల్‌ కోం ఫారం-10సీ సమర్పించాల్సి ఉంటుంది. పాక్షిక క్లెయిమ్‌ల కోసం ఫారం-31 వాడాలి. క్లెయిమ్‌ చేసేందుకు యాక్టివ్‌ యూఏఎన్‌తో పాటు దానికి మొబైల్‌ నంబర్‌ అనుసంధానం అయ్యి ఉండాలి. అలాగే, ఆధార్‌, ఇ-కేవైసీ, బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలు ఉండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *