Prime Ministers Employment Generation Programme ( PMEGP ) Scheme :
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ( Prime Ministers Employment Generation Programme – PMEGP ). స్వశక్తితో నిలబడాలనుకునే నిరుద్యోగులకు PMEGP పథకం ద్వారా రూ.లక్ష నుంచి 50 లక్షల వరకు రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే.. ఈ రుణంలో కేంద్ర ప్రభుత్వం 35 శాతం వరకు రాయితీ ఇస్తోంది. ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా.. దరఖాస్తు చేయడం మొదలు ఎంపికవరకు అంతా.. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో నిర్వహించే పథకం PMEGP స్కీమ్.
PMEGP అసలు లక్ష్యం ఏమిటంటే..?
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పథకాలు/ ప్రాజెక్టులు/ సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పించడం.
- గ్రామాల్లో పట్టణాల్లో ఉపాధి, ఉద్యోగం లేక చెల్లాచెదురైపోయిన చేతి వృత్తుల వారిని/ నిరుద్యోగ యువతను మళ్లీ సంఘటితం చేసి వారికి అక్కడ స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడం. తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం.
- వారున్న ప్రాంతాల్లోనే సుస్థిర ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లకుండా నిరోధించడం PMEGP ప్రధాన లక్ష్యాలు.
PMEGP నేపథ్యం ఏమిటంటే..?
- భారతదేశంలోని గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ PMEGP.
- గతంలో అయితే ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన పథకం అనే రెండు రకాల పథకాలను కేంద్రం నిర్వహించేది. అనంతరం ఈ పథకాలను కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) ప్రారంభించింది.
- కేంద్ర ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) ద్వారా ఈ పథకం అమలవుతోంది.
- ఈ KVIC జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీ ద్వారా, రాష్ట్రాల పరిధిలో KVIC బోర్డులు, జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC) ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంటుంది.
PMEGP రుణం వేటికి ఇస్తారంటే..?
కొత్తగా ఏర్పాటు చేసే చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్యతరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. అయితే ఈ పథకంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన పాత యూనిట్ల విస్తరణకు, వాటి నవీకరణకు రుణం ఇవ్వరు. అలాగే.. నెగిటివ్ పరిశ్రమల జాబితాలో ఉన్నవాటికి ఈ పథకం వర్తించదు. ఈ పథకాన్ని 2026 వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2021-2022 నుంచి 2025-2026 మధ్య కాలంలో PMEGP పథకం అమలుకు 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) రూ.13,554.42 కోట్లు కేటాయించింది.
PMEGP కింద మొదట ఎంత పెట్టుబడి పెట్టాలి?
మొదట జనరల్ కేటగిరీ వ్యక్తులు తాము ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు సంబంధించి మొత్తం వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించాల్సి ఉంటుంది. ఇక.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు చెందిన లబ్ధిదారులు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతం సొంత వనరులుగా పెట్టుబడి పెట్టాలి. సాధారణ కేటగిరీ లబ్ధిదారులకు ప్రాజెక్టు వ్యయంలో 90 శాతం మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణం అందజేస్తారు. వెనుకబడిన వర్గాలకు చెందిన లబ్ధిదారులకు 95 శాతం మొత్తాన్ని రుణంగా మంజూరు చేస్తారు.
PMEGP పథకం కింద ఎంత రుణమిస్తారు?
మీరు పెట్టబోయే కొత్త తయారీ యూనిట్‌కు రూ. 50 లక్షల వరకు రుణం ఇస్తారు. సర్వీసు యూనిట్లకయితే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. గతంలో ఈ రుణ సదుపాయం గరిష్ఠంగా 25 లక్షల వరకు మాత్రమే ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ప్రోత్సాహం అందివ్వాలనే ఉద్దేశంతో రుణ పరిమితిని 50 లక్షల రూపాయల వరకు పెంచింది.
PMEGP రుణంలో సబ్సిడీ ఎంతంటే..?
దరఖాస్తుదారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, శారీరక వైకల్యం కలిగిన వారైతే.. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులకు గరిష్ఠంగా 35 శాతం రాయితీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు 25 శాతం రాయితీ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకూ రుణంలో సబ్సీడీ సదుపాయం ఉంటుంది. అయితే ఈ కేటగిరీ గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోయే యూనిట్‌కు 25 శాతం సబ్సిడీ, పట్టణ ప్రాంతాల్లో వాటికి 15శాతం సబ్సిడీ కల్పిస్తారు.
PMEGP పథకానికి దరఖాస్తు చేసుకోగానే రుణం ఇవ్వరు :
PMEGP పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే నిధులు మంజూరు చేయరు. మొదట మీరు ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించి మీకు కేంద్ర ప్రభుత్వం ఒక నెల రోజుల శిక్షణ ఇస్తుంది. ఈ శిక్షణ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఉండొచ్చు. ఈ శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకోకముందే కూడా ఈ శిక్షణ పూర్తి చేసుకుని తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
PMEGP పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
ఈ పథకం విషయంలో అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అయితే.. ప్రాజెక్టు ఏర్పాటును మాత్రం భౌతికంగా తనిఖీ చేసి పరిశీలన చేస్తారు. PMEGP పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://kviconline.gov.in/ క్లిక్ చేసి PMEGP పోర్టల్‌లోకి వెళ్లాలి. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకోవాలి. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులైతే కేవీఐసీకి, పట్టణ నిరుద్యోగులైతే డీఐసీలో వివరాలను నమోదు చేయాలి. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకోవాలి.అనంతరం ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి అక్కడ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా మీరు ఈ సైటులో లాగిన్ అవడం కోసం మీకు ప్రత్యేకంగా ఒక యూజర్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులో అడిగిన వివరాలన్నీ పొందుపరచాలి. దరఖాస్తు చేసిన వెంటనే 10 నుంచి 15 రోజుల వ్యవధిలో అధికారుల నుంచి స్పందన వస్తుంది. ఆ తర్వాత మీ ప్రాజెక్ట్‌కు నిధుల మంజూరుకు సంబంధించి పనులు ప్రారంభమవుతాయి.
PMEGP పథకానికి అర్హతలు ఏమిటంటే..?
- 18 సంవత్సరాల వయసు నిండిన వారంతా అర్హులే.
- కనీసం 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- స్వయం సహాయక బృందాలు (ఏ ఇతర పథకాల కింద ప్రయోజనాలు పొందని బిపిఎల్‌కు చెందిన వారితో కలిపి) అర్హులు.
- (వ్యక్తి, తన భార్య/భర్త కలిపి) ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు.
PMEGP దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు :
- మీ పాస్ పోర్టు సైజు ఫొటోతోపాటు పూర్తిగా నింపిన దరఖాస్తు
- మీ పెట్టబోయే యూనిట్‌కు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు
- మీ చిరునామా, గుర్తింపునకు సంబంధించి ఐడెంటిటీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్
- మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు
- మీరు ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన వారైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్
- కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన శిక్షణకు సంబంధించి ఎంటర్‌ప్రెన్యూవర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) వారు ఇచ్చిన సర్టిఫికెట్.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీహెచ్‌సీలకు సంబంధించిన సర్టిఫికెట్
- విద్యార్హతలు, సాంకేతిక విద్యార్హతలు (ఏవైనా ఉంటే) ఆ సర్టిఫికెట్‌లు ఉండాలి.