January 18, 2026

ఏటీఎం నుంచి 75 శాతం పీఎఫ్ విత్‌డ్రా..

PF Withdrawal Through UPI : కేంద్ర ప్రభుత్వం, ఈపీఎఫ్ఓ ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ సర్వీసుల్ని మరింత సులభతరం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పాక్షిక ఉపసంహరణల కోసం 13 రకాల సంక్లిష్ట నిబంధనలు ఉండగా వీటిని మూడుకు కుదించింది. ఇంకా కనీసం 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతులు కల్పించింది. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏటీఎం అలాగే యూపీఐ ద్వారా కూడా నేరుగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం మార్చిలో రానుందని కేంద్రం ప్రకటించింది.

EPF New Rules :
ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే దాదాపు అందరికీ ఈపీఎఫ్ అకౌంట్ గురించి తెలిసే ఉంటుంది. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంటుంది. ఇది ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను అందించేందుకు ఉద్దేశించిన సామాజిక భద్రతా పథకం అని చెప్పొచ్చు. అయితే కొన్ని అవసరాల కోసం పాక్షికంగా మధ్యలోనే ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇటీవల ఈపీఎఫ్ సేవలు, సర్వీసులకు సంబంధించి.. కేంద్రం నిబంధనల్ని సవరిస్తూ.. మరింత సరళంగా మారుస్తోంది. దీని కింద పలు అత్యవసరాలకు కనీసం 75 శాతం పీఎఫ్ మొత్తాన్ని తక్షణమే విత్‌డ్రా చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తోంది. ఇంకా.. పలు సంక్లిష్ట నిబంధనలు ఉండగా వాటిని క్రమంగా తొలగిస్తూ.. మరింత సులభతరం చేస్తోంది.

ఇంకా పీఎఫ్ విత్‌డ్రా కోసం గతంలో ఆఫ్‌లైన్‌లో ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించడం ద్వారా లేదా ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చేసుకునేందుకు వీలుండేది. కానీ త్వరలో దీనిని ఏటీఎం ద్వారా ఉపసంహరించుకోవచ్చని.. యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని కేంద్రం చెబుతూనే ఉంది. దీంతో అవసరానికి వేగంగా డబ్బులు అందుతాయని చెప్పొచ్చు.

అయితే దీనిపై ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఈపీఎఫ్ చందాదారులు.. తన పీఎఫ్ నగదును త్వరలోనే ఏటీఎం, యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు. 2026 మార్చి కల్లా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు మాండవీయ.

“ఇప్పటికీ మీరు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి 75 శాతం తక్షణమే ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం నుంచి పీఎఫ్ నగదు ఉపసంహరణ ఫీచర్‌ను 2026 మార్చికి ముందే తీసుకురాబోతున్నాం. ఇది ఇంతకుముందే చెప్పాను. అప్పుడే తీసుకురానున్నాం. ఇంకా ఈపీఎఫ్ విత్‌డ్రాను యూపీఐతో కూడా లింక్ చేయనున్నాం.’ అని మాండవీయ తెలిపారు. ఇంకా ప్రస్తుత ఈపీఎఫ్ నగదు ఉపసంహరణ ప్రక్రియపైనా మాట్లాడారు. ఇప్పుడు డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఎన్నో ఫారాలు నింపాల్సి వస్తుందని.. భవిష్యత్తులో ఇది ఉండదని స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో పీఎఫ్ సేవల్ని మరింత పారదర్శకంగా.. సరళంగా.. సులభతరంగా మార్చేందుకు కేంద్రం పలు కీలక చర్యలు చేపట్టింది. ఇది ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్షన్స్‌ను గణనీయంగా తగ్గించడంలో.. అవసరానికి అర్హులైన వారికి పీఎఫ్ నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించింది. ముఖ్యంగా వైద్య అవసరాలకు.. ఇతర ఎమర్జెన్సీ పనుల కోసం ఆటోమేటిక్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో మానవ ప్రమేయం లేకుండానే క్లెయిమ్స్‌ను పరిష్కరించిందని చెప్పొచ్చు. దీంతో భవిష్యత్తులో మరింత సులభంగా అవసరానికి డబ్బు అందేలా చేయడంలో ఏటీఎం నగదు ఉపసంహరణలు ఉపయోగపడతాయని అంతా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)