December 3, 2025

ఏపీలో వారందరికీ ఎగిరి గంతేసే వార్త.. మహిళలతో పాటుగా దివ్యాంగులకు కూడా ఉచిత  ఆర్టీసీ  బస్సు ప్రయాణ సౌకర్యం..

ఏపీలో మహిళలకు స్త్రీ శక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, టిడ్కో ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు సహా ఏడు వరాలు వారికి ప్రకటించారు.

దివ్యాంగులకు కూడా ఉచిత  ఆర్టీసీ  బస్సు ప్రయాణ సౌకర్యం....

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు వరాలు కురిపించారు. విజయవాడలో జరిగిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పట్టుదల ఎక్కువ అని.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధించగలరని చంద్రబాబు అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే దివ్యాంగుల పింఛన్ మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా కూడా దివ్యాంగులకు ఆరువేల రూపాయలు పింఛన్ ఇవ్వడం లేదని చంద్రబాబు వెల్లడించారు.

దివ్యాంగులకు అండగా ఉండాలనే లక్ష్యంతో…..

దివ్యాంగులకు మోటార్ వాహనాలు, ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలను అందిస్తున్నామన్న చంద్రబాబు.. ఆర్థికంగా కష్టాలు ఉన్నప్పటికీ దివ్యాంగులకు అండగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వైకల్యం విజయానికి అడ్డు కాదని.. వారికి అండగా ఉండి, ప్రోత్సహిస్తామన్నారు. ఈ క్రమంలోనే దివ్యాంగులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు వరాలు కురిపించారు. ఇంద్ర ధనస్సులా దివ్యాంగుల జీవితాలు వెలుగొందాలనే ఉద్దేశంతో చంద్రబాబు దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించారు.
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం 50 శాతం రాయితీ ఇస్తుండగా.. మహిళల తరహాలోనే వారికి పూర్తి స్థాయిలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తామని ప్రకటించారు.

 రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం అన్ని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు అవకాశం ….

దివ్యాంగులను రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం అన్ని స్థానిక సంస్థల్లో దివ్యాంగులకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా అవకాశం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. దివ్యాంగులకు ఆర్థిక సబ్సిడీ పునరుద్ధరిస్తామని.. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ తరహాలో ఆర్థిక రాయితీలు అందిస్తామన్నారు. క్రీడల్లో వారికి పూర్తి స్థాయి భాగస్వామ్యం కల్పిస్తామని.. శాప్ ద్వారా దివ్యాంగులకు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. టిడ్కో ఇళ్లల్లో గ్రౌండ్ ఫ్లోర్లలో దివ్యాంగులకు ఇళ్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

వినికిడి లోపం ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక ఏర్పాట్లు …..

వినికిడి లోపం ఉన్న వారికి ప్రత్యేక డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని.. దివ్యాంగ విద్యార్థులకు కాలేజీలు, హాస్టళ్లల్లో పింఛన్లు అందించే సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో దివ్యాంగుల కోసం విభిన్న ప్రతిభావంతుల భవనం నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అమరావతిలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *