తపాలా శాఖ స్పీడ్ పోస్ట్
ఒక రోజులోనే డెలివరీ….తపాలా శాఖలో కీలక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అత్యవసర పార్శిళ్ల కోసం 24 గంటలు, 48 గంటల డెలివరీ గ్యారెంటీ పేరిట మూడు ప్రీమియం సర్వీసులను ప్రారంభించింది. 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్‌పోస్ట్ పార్శిల్, 48 స్పీడ్ పోస్ట్ సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లాంఛనంగా ఈ సేవల్ని ప్రారంభించారు. డాక్యుమెంట్లు, పార్శిళ్లు వంటివి 24 గంటలు, 48 గంటల్లో చేరవేయడం ఈ సేవల ముఖ్య ఉద్దేశం.

24 Speed Post : మొదటి దశలో దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సింధియా తెలిపారు. ఓటీపీ డెలివరీ, డెలివరీ పూర్తయ్యేంత వరకు ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు, వ్యాపారుల కోసం బై నౌ పే లేటర్ సౌకర్యం, బల్క్ బుకింగ్‌లకు ఉచిత పికప్, జియో ట్యాగింగ్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్ వంటి సేవలు లభిస్తాయన్నారు. సేవల్లో జాప్యం జరిగితే డబ్బును తిరిగి చెల్లించనున్నారు. ప్రస్తుతం ఇ -కామర్స్ మార్కెట్ విలువ రూ.11 లక్షల కోట్లుగా ఉండగా.. 2030 నాటికి రూ.30 లక్షల కోట్లకు చేరుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.