EPFO సేవలు ఇక నుంచి వాట్సప్‌లో :
EPFO : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన సేవలను సులభతరం చేయడంలో భాగంగా వాట్సప్‌ను వినియోగించుకోనుంది. ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సర్వీసుల కోసం త్వరలో వాట్సప్ సేవలను అందుబాటులోకి తేనుంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాట్సప్‌ను వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ యాప్ ద్వారా కోట్లాదిమంది చందాదారులను చేరుకోవడం సులభతరం అవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.

PF బ్యాలెన్స్, చివరి ఐదు లావాదేవీలు, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలు వాట్సప్ ద్వారా తెలుసుకోవచ్చు. గ్రీన్ టిక్ మార్క్ కలిగిన ఈపీఎఫ్ఓ వాట్సప్ నంబర్‌కు ‘హలో’ అని మెసేజ్ చేయడం ద్వారా ఈ సేవలు పొందొచ్చు. యూఏఎన్‌తో అనుసంధానం అయిన మొబైల్ నంబర్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి. ఈపీఎఫ్ఓ నుంచి సందేశాలు సైతం స్థానిక భాషల్లో ఎప్పటికప్పుడు అందుకోవచ్చు. ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా 24/7 వాట్సప్‌లో సేవలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
త్వరలోనే యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా సదుపాయం :
EPFO : పీఎఫ్ నిల్వలను యూపీఐ ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం కూడా త్వరలోనే అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి తెలిపారు. యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా ఈపీఎఫ్ నిధులను ఉపసంహరణ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించినట్లు చెప్పారు. ఈ లావాదేవీలు నిర్వహించేందుకు యూపీఐ పిన్ అవసరం అవుతుందని, అలా విత్‌డ్రా అయిన మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. ఆపై ఏటీఎం లేదా యూపీఐ ద్వారా నగదును తమ అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ సేవలు సజావుగా అందుబాటులోకి తెచ్చేందుకు సాఫ్ట్వేర్ లోపాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే ఏడు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు.