Aadhaar Update : నవంబరు 1 నుంచి కొత్త నిబంధనల అమలు
ఆధార్ సంస్థ ( UIDAI ) నవంబరు 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలను అమలు చేయనుంది. అందులో భాగంగా ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌ను మరింత సులభతరం చేసింది. ఆధార్ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చొనే పని లేకుండా.. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు లాంటి వాటిని ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడానికే ఈ కొత్త ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆధార్ సంస్థ తెలిపింది. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్‌లాంటి బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సిందేనంది.
కొత్త అప్‌డేషన్ ఛార్జీలు వివరాలు
- ఇటీవల అప్‌డేట్ ఛార్జీలూ మారాయి. పేరు, చిరునామా/ఫోన్ నంబరు అప్‌డేట్‌కు రూ.75, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటో అప్‌డేట్‌కు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.
- 5-7 సంవత్సరాలు, 15-17 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్ అప్‌డేట్ ఉచితం.
- 2026 జూన్ 14 వరకు ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్‌లకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నమోదు కేంద్రాల్లో రూ.75 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆధార్ పునర్ ముద్రణ ( Reprint )అభ్యర్థనకు రూ.40 చెల్లించాలి.
ఆధార్ వివరాల అప్‌డేషన్….కోసం
ఆధార్ కార్డుదారులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు వంటి వివరాలు మార్చుకోవడం, నవీకరించుకోవడం కోసం గతంలో ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై దీన్ని ఆన్‌లైన్‌లోనే సులువుగా చేసుకోవచ్చు. మీరు అప్‌డేట్ చేసిన వివరాలను ప్రభుత్వ గుర్తింపుకార్డుతో అధికారులు వెరిఫై చేస్తారు. ఇందుకోసం పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్‌కార్డు, జనన ధ్రువీకరణ పత్రంలాంటి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం myAadhaar portal కు వెళ్లి ఆధార్, ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆపై మీకు కావాల్సిన వివరాలను మార్చుకోవడానికి సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
పాన్‌కార్డుతో లింకు చేయాల్సిందే..
- కొత్త నిబంధనల ప్రకారం… ప్రతిఒక్కరూ తమ పాన్‌కార్డును ఆధార్‌తో లింకు చేయాలి. ఈ పనిని డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలి. ఒకవేళ లింకు చేయకపోతే 2026 జనవరి 1 నుంచి పాన్‌కార్డు చెల్లదు.
- బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కేవైసీ చేయడానికి ఇక నుంచి ఆధార్ నంబరు సరిపోతుంది. ఆధార్ ఓటీపీ ద్వారానే కాకుండా వీడియో కన్ఫర్మేషన్, ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్‌తోనూ కేవైసీని పూర్తి చేయొచ్చు.