
బంగాళాఖాతంలో అల్పపీడనం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. అటు వర్షాలు, ఇటు చలి మంచు ముసురుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఈ నెల9 నుంచి భారీ వర్షాలు : దక్షిణ-ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో కొంత బలహీనపడే అవకాశం ఉంది. అయినప్పటికీ దాని ప్రభావం ఏపీపై ఉండనుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా జనవరి 9వ తేదీ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది.
వాహనదారులకు కీలక సూచనలు: పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున రవాణా శాఖ మరియు పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు ఇష్టానుసారం లేన్లు మార్చవద్దని సూచించారు. మంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కకు నిలిపివేయడం ఉత్తమం. ప్రయాణంలో ఉన్నప్పుడు వెనుక వచ్చే వాహనాలకు తెలిసేలా తప్పనిసరిగా ఇండికేటర్లు వాడాలి. చలికాలంలో రోడ్లు తడిగా ఉండి వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సడన్ బ్రేకులు వేయకుండా జాగ్రత్త వహించాలి. కారు అద్దాలను కొద్దిగా దించడం వల్ల లోపల పొగమంచు కేంద్రీకృతం కాకుండా డ్రైవర్‌కు చూపు స్పష్టంగా ఉంటుంది.
కొనసాగుతున్న మంచు దుప్పటి: ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రతతో పాటు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. కోస్తా జిల్లాల్లో దట్టమైన మంచు కురుస్తోంది. ఇది మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అంతేకాకుండా మిగిలిన అన్ని జిల్లాల్లో సైతం మోస్తరుగా మంచు కురుస్తుందని తెలిపారు. దీంతో ఉదయం పూట వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.