టెన్త్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ! సాయుధ దళాల్లో 25,487 పోస్టులు
పదో తరగతి విద్యార్హతతోనే యూనిఫాం ఉద్యోగాలకు అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాల్లో 25487 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువడింది. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్ బేస్డ్, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, ఆరోగ్య పరీక్షలతో ఎంపిక చేస్తారు. వీరిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40,000 వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా సాయుధ దళాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు తక్కువ ప్రయత్నాల్లోనే విజయవంతం కావడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు ఆసక్తి, మెరిట్ ప్రకారం.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో ఏదైనా ఎంచుకోవచ్చు. వీరంతా లెవెల్-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి. అనుభవంతో హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలతో ఎస్సై, ఆపై స్థాయిలోనూ సేవలు అందించవచ్చు.
వివరాలు
ఖాళీలు: 25,487. వీటిలో 2020 మహిళలకు కేటాయించారు.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2026 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. 02.01.2003 – 01.01.2008 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
సన్నద్ధత..
☞పరీక్షలో విజయానికి ముందుగా చేయాల్సింది..నోటిఫికేషన్‌లోని సిలబస్ వివరాలను శ్రద్ధగా గమనించి, అందులోని అంశాలనే బాగా చదవాలి. అధ్యయనంలో పరిమిత పుస్తకాలను ఎంచుకుని, వాటినే ఎక్కువ సార్లు అధ్యయనం చేయాలి.
☞విభాగాలు, అందులోని అంశాల వారీ సన్నద్ధత కొనసాగించాలి. ప్రతి అంశంలోనూ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
☞గత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. దీంతో ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. విభాగాల వారీ ఏ అంశాలకు ప్రాధాన్యం ఉందో గ్రహించాలి. సాధన అందుకు అనుగుణంగా మలుచుకోవాలి.
☞60 నిమిషాల్లో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకూ 45 సెకన్లే ఉంటాయి. అందువల్ల తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు.
☞క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల ప్రశ్నలకు సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి.. పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్ కట్ మెథడ్స్‌పై పట్టు సాధించాలి.
☞రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి. అలాగే సమాధానం కోసం ఎక్కువ సమయం అవసరమయ్యే ప్రశ్నలను చివరలోనే ప్రయత్నించాలి.
☞ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ పాత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ప్రయోజనమే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. అగ్నివీర్ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగపడతాయి
☞పరీక్షకు ముందు కనీసం 20 మాక్ టెస్టులైనా రాయాలి. పరీక్షల వారీ ఫలితాలను సమీక్షించుకుని, చేసిన తప్పులే మళ్లీ చేయకుండా, వెనుకబడుతోన్న అంశాలకు ప్రాధాన్యమిస్తే స్కోరు మెరుగవుతుంది.
☞పరీక్షకు ముందు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన మాక్ టెస్ట్ రాస్తే ప్రయోజనం.
☞పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచీ నేర్చుకున్నవన్నీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ముఖ్యాంశాలు మరోసారి చదవాలి.
పరీక్ష ఇలా
☞ఆన్‌లైన్‌లో 160 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట.
☞80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, ఇంగ్లిష్/హిందీ ఒక్కో విభాగం నుంచీ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష మాధ్యమంగా తెలుగు, ఇంగ్లిష్ లేదా ఏదైనా భాషను ఎంచుకోవచ్చు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో పదో తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటాయి. తప్పు జవాబుకు పావు మార్కు తగ్గిస్తారు.
☞పరీక్షలో అర్హత కోసం జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఏ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి రాష్ట్రాలు, విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల మందిని ఫిజికల్ టెస్టులకు పిలుస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు తేదీ : డిసెంబరు 31
దరఖాస్తు ఫీజు : రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు.
పరీక్ష : ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్య నిర్వహిస్తారు. తేదీలు తర్వాత ప్రకటిస్తారు.
పీఈటీ, పీఎస్‌టీ
పీఈటీలో.. పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే చాలు. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ.పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. అన్ని విభాగాల్లోనూ అర్హులైనవారి జాబితా నుంచి పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 2 రెట్ల మందిని మెడికల్ టెస్టుకు అవకాశమిస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్, రాష్ట్రాలు, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్ హోదాతో సేవలందిస్తారు.