February 10, 2026

ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి పెంపు కార్మికశాఖ పరిశీలనలో ప్రతిపాదనలు :ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ పథకాల్లో ఒకే వేతన పరిమితి అమలు చేయాలనీ భావిస్తోంది. సుదీర్ఘకాలంగా కనీస వేతన పరిమితి పెంచాలన్న కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. బడ్జెట్‌లో లేదంటే త్వరలో వడ్డీ ఖరారు నిర్వహించే జరిగే సెంట్రల్‌ బోర్డు ట్రస్టీ(సీబీటీ)ల సమావేశంలో కేంద్రం ఈ మేరకు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. అదేసమయంలో కనీస పింఛను పెంచే అంశంపైనా ప్రతిపాదనలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈపీఎఫ్‌వో చందాదారులకు ప్రస్తుతమున్న కనీస పింఛను రూ.వెయ్యి నుంచి రూ.2-3 వేలకు పెంచే విషయాన్నీ పరిశీలిస్తోంది.

ఈపీఎఫ్‌ గరిష్ఠ వేతన పరిమితి 2014లో రూ.6,500 ఉండేది. దాన్ని అదే ఏడాది కేంద్ర కార్మికశాఖ రూ.15 వేలకు పెంచింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ పరిమితిని పెంచాలని ఐదేళ్లుగా కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు కొత్త లేబర్‌కోడ్‌ ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వేతన పరిమితి ఒకేవిధంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతన పరిమితి రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంది. గత కొంతకాలంగా సీబీటీ సమావేశాల్లో కార్మిక సంఘాల ప్రతినిధులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతన పరిమితి పెంపు ప్రతిపాదనను కార్మికశాఖ పరిశీలిస్తోంది. ఒకవేళ పెంచితే రూ.25 వేలకు పెరిగే అవకాశాలున్నట్లు కార్మిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • వేతన పరిమితి (బేసిక్‌+డీఏ కలిపి)ని నెలకు రూ.25 వేలకు పెంచితే… రూ.25 వేల వరకు అంతకుమించి జీతం పొందుతున్న ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది. 
  • రూ.25 వేల వేతనంలో ఉద్యోగి ఖాతా నుంచి 12% కింద ఈపీఎఫ్‌కు రూ.3 వేలు జమ అవుతాయి. యాజమాన్యం కూడా 12% అంటే రూ.3 వేలు ఇస్తుంది. యజమాని వాటాలో ఈపీఎస్‌కు 8.33% కింద రూ.2,083 జమ చేయగా.. మిగతా సొమ్ము ఉద్యోగి ఖాతాలోకి వెళ్తుంది. అంటే ఉద్యోగి ఖాతాలో జమ పెరుగుతుంది. 
  • కొందరి వాస్తవిక వేతనం ఎక్కువగా ఉన్నా… పింఛను లెక్కింపు కోసం ప్రస్తుత వేతన పరిమితి రూ.15 వేలనే తీసుకుని పింఛను లెక్కిస్తున్నారు. పెంపు అనంతరం రూ.25 వేలను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తే విశ్రాంత కార్మికుల చేతికందే పింఛను పెరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)