March 10, 2026

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)-2026, ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్‌)-2026 అమల్లోకి తీసుకురానుంది. ఈపీఎఫ్‌-1952, ఈపీఎస్‌-1995 పథకాల స్థానంలో ఇవి రానున్నాయి. ఇటీవల జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ట్రస్టీ బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చేలా త్వరలో గెజిట్‌ జారీ చేసేందుకు కేంద్ర కార్మికశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ పథకాలు అమల్లోకి వచ్చినప్పటికీ..  భవిష్యత్తులో అన్ని వర్గాలతో సంప్రదించి అవసరమైన మార్పులు.. చేర్పులు చేస్తామని వెల్లడించింది. వివిధ కేటగిరీల్లో ఈపీఎఫ్‌ ఉపసంహరణల సంఖ్యను పెంచింది. పింఛను ఖరారులో దామాషా పద్ధతి పాటించనున్నట్లు వెల్లడించింది. యజమాని పీఎఫ్‌కు ప్రతినెలా చెల్లించాల్సిన తన వాటాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగి వేతనం నుంచి మినహాయించకూడదని, అలాగే ఈ వాటాను ఉద్యోగి నుంచి వెనక్కు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఇలా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

ఈపీఎఫ్‌ చందాదారుగా చేరిన 12 నెలల వ్యవధి తరువాత అనారోగ్యం, విద్య, వివాహం కేటగిరీ ల కింద ఉపసంహరణ చేయవచ్చు. అనారోగ్యం కేటగిరీలో ఏడాదికి మూడుసార్లు, విద్యకు మొత్తం సర్వీసులో పదిసార్లు, వివాహం కోసం ఐదుసార్లు క్లెయిమ్‌ చేయవచ్చు.

గృహం కొనుగోలు, నిర్మాణం, రుణ చెల్లింపు, మరమ్మతుల కోసం 12 నెలల చందా చెల్లింపు సర్వీసు ఉండాలి. మొత్తం సర్వీసులో ఐదుసార్లు అనుమతి ఉంటుంది. ఇప్పటిదాకా రెండు సార్లు ఉండేది.

ప్రత్యేక సందర్భాల్లో ఏడాది సర్వీసు పూర్తిచేయకున్నా క్లెయిమ్‌ చేయవచ్చు. అయితే కనీస నిల్వ మినహాయించి నగదు పొందవచ్చు.

ఉద్యోగి వయసు 55 ఏళ్లు నిండినా, ఆ వయసు కన్నా లోపు ఉద్యోగాన్ని వదిలిపెట్టినా, విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోయినా, ఉద్యోగం నుంచి తొలగించినా, భవిష్య నిధి ఖాతాలో పూర్తి నిల్వ వెనక్కు తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)