June 26, 2026

ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్ కోసం ఫీజుల పేరిట తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతుందనే విమర్శలు ఏళ్లుగా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయడమే కాకుండా.. పారదర్శక వ్యవస్థ తీసుకురావడంపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. జిల్లా స్థాయి కమిటీల నుంచి ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థ వరకు అనేక కీలక ప్రతిపాదనలను సిద్ధం చేసింది.

ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రతి ఏడాది వస్తూనే ఉన్నాయి. దీనిపై పలుమార్లు న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఫీజు నియంత్రణ విధానానికి రూపకల్పన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో అధికారులు రూపొందించిన ముసాయిదాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండటంతో పాటు.. తల్లిదండ్రులపై అనవసర భారం పడకుండా చూడడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటవుతుంది. జిల్లా విద్యాశాఖాధికారి, సంబంధిత అధికారులు, పాఠశాలల ప్రతినిధులతో పాటు తల్లిదండ్రుల ప్రతినిధులకు కూడా ఇందులో చోటు కల్పించనున్నారు. ప్రతి పాఠశాల ప్రతిపాదించే ఫీజులను కమిటీ పరిశీలించి.. నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. అనుమతి లేకుండా ఫీజులు పెంచడం, అదనపు రుసుములు వసూలు చేయడం వంటి అంశాలపై కూడా కమిటీ నిఘా ఉంచుతుంది.

తల్లిదండ్రులు ఫీజులపై నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అధిక ఫీజులు, బలవంతపు పుస్తకాలు, యూనిఫాంల కొనుగోలు, ఇతర రుసుములపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా కమిటీ విచారిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలకు మొదట హెచ్చరికలు, ఆ తర్వాత జరిమానాలు, అవసరమైతే గుర్తింపు రద్దు వరకు చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఫీజు వివరాలను ముందుగానే బహిరంగంగా ప్రకటించడం కూడా తప్పనిసరి చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న పాత ఫీజు నియంత్రణ నిబంధనల్లో అనేక లోపాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలను పరిశీలించి కొత్త పాలసీకి తుది రూపం ఇస్తోంది. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజు నియంత్రణ విధానాలను అధ్యయనం చేసిన అధికారులు.. ఆ అనుభవాలను కూడా ఇందులో పొందుపరుస్తున్నారు. తల్లిదండ్రులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తుది విధానాన్ని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఏళ్లుగా వివాదాస్పదంగా మారుతున్న ప్రైవేట్ స్కూల్ ఫీజుల వ్యవస్థకు కొత్త పాలసీతో పరిష్కారం దొరుకుతుందా..? తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందా..? లేక పాఠశాలల యాజమాన్యాలు కొత్త నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయా..? అన్నది ప్రభుత్వం తుది విధానం ప్రకటించిన తర్వాతే స్పష్టత రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)