కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ :
ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఇక నుంచి ఉద్యోగం మానేశాక వారాల పాటు ఫైనల్ సెటిల్మెంట్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇక నుంచి రెండు రోజుల్లోనే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్ రానుంది.

ఏప్రిల్ 1 వస్తుందంటే.. కొత్త ఆర్ధిక సంవత్సరం గురించి అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అప్పటినుంచి ఆర్ధిక విషయాలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి వస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకింగ్ సంస్థలు అనేక నిర్ణయాలను వర్తింపచేస్తూ ఉంటాయి. ఆర్దిక కార్యకలాపాలను ప్రభావితం చేసే ఈ మార్పుల గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత కొత్త కార్మిక చట్టంలోని కీలక నిబంధన రానుంది. దేశంలో ఉద్యోగం చేసే ప్రతీఒక్కరికి ఇది ఉపయోగపడనుంది. ఉద్యోగం మానేశాక జరిగే రిలీవింగ్ ప్రాసెస్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు ఏదైనా కంపెనీలో ఉద్యోగం మానేస్తే.. ఉద్యోగం చివరి పనిరోజు నుంచి 45 రోజుల్లోగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేవారు.
కానీ ఇప్పుడు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇకపై 45 రోజుల గ్రేస్ పీరియడ్ ఉండదు. ఉద్యోగి చివరి పని దినం నుంచి రెండు రోజుల్లోపు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. వేతనాల కోడ్ కింద కార్మిక చట్ట సంస్కరణల్లో భాగంగా ఈ నిబంధన రానుంది. ఇక ఉద్యోగుల రాజీనామా, తొలగింపు, లేఆఫ్‌లతో పాటు అన్ని రకాల ఉద్యోగ విరమణలకు ఇది వర్తిస్తుంది
పెండింగ్ శాలరీ, పెండింగ్ లీవ్స్‌కు నగదు చెల్లింపు, బోనస్, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర చెల్లింపుల ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. ఇప్పటివరకు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్‌కు ఖచ్చితమైన కాలపరిమితి లేదు. ఒక్కొ కంపెనీ ఒక్కొలా హెచ్‌ఆర్ పాలసీలు పాటిస్తున్నాయి. కానీ అన్ని కంపెనీలు ఫైనల్ సెటిల్మెంట్‌కు వారాల పాటు సమయం తీసుకుంటున్నాయి. కొన్నిసార్లు నెలల సమయం తీసుకుంటున్నారు.
ఇక నుంచి రెండు రోజుల్లోగా సెటిల్మెంట్ చేయడం ద్వారా ఉద్యోగులకు వెంటనే డబ్బులు అందనున్నాయి. దీని వల్ల వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఉద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చనుంది . కాగా గత ఏడాది నవంబర్‌లో ఉద్యోగులకు ఉపయోగపడేలా కేంద్ర కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.