May 19, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు భారీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ మెడికల్ యూనిట్ల (MMU) ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 104 వాహనాల ద్వారా అందించే సేవలపై స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. వైద్యం పేరుతో జేబులు గుల్ల చేసుకుంటున్నవారికి ఉపశమనం కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా చిన్న చిన్న పరీక్షల కోసం కూడా గ్రామీణులు పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం 904 ఎంఎంయూ వాహనాల ద్వారా ఏకంగా 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏటా రూ. 162.72 కోట్లు వెచ్చించనుంది.

సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను కూడా విధించింది. ప్రతి 104 వాహనంలో ప్రతిరోజూ కనీసం 20 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. నెలకు 26 పనిదినాలుగా పరిగణించి, ఒక్కో యూనిట్ నెలకు కనీసం 520 మందికి తప్పనిసరిగా పరీక్షలు చేయాలి. ప్రతి ఎంఎంయూ వాహనానికి నెలకు రూ. 1.50 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే, నిర్దేశించిన 520 మంది కంటే తక్కువ మందికి పరీక్షలు చేస్తే, ఆ నిష్పత్తిలో చెల్లింపుల్లో కోత విధించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ సేవల పర్యవేక్షణ బాధ్యతను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్‌కు అప్పగించారు. 104 వాహనాల నిర్వహణ సంస్థ ఈ ట్రస్ట్‌తో ప్రత్యేకంగా ఎంఓయూ కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల నిధుల విడుదల, సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు సమీక్షించే అవకాశం ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు పెనుభారం తగ్గుతుంది. బీపీ, షుగర్ వంటి సాధారణ పరీక్షల నుండి కీలకమైన 41 రకాల పరీక్షలు ఇంటి వద్దకే రావడం వల్ల రాష్ట్ర ఆరోగ్య ముఖచిత్రం మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో 104 వాహనాలు కేవలం మందుల పంపిణీకే పరిమితం కాకుండా, ఒక మినీ డయాగ్నోస్టిక్ సెంటర్లుగా రూపాంతరం చెందనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)