February 10, 2026

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారులు, తమ ఈపీఎఫ్‌లో ఉన్న సొమ్మును యూపీఐ పేమెంట్‌ గేట్‌వే ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఉపసంహరించుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకోసం సరికొత్త ఈపీఎఫ్‌ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈపీఎఫ్‌లో కొంత భాగం మినహా మెజారిటీ వాటాను చందాదారులు తమ బ్యాంకు ఖాతాలోకి యూపీఐ ద్వారా ఉపసంహరించుకునే సౌలభ్యాన్ని తీసుకొచ్చే ప్రాజెక్టుపై కార్మిక శాఖ పనిచేస్తుంది. ఈపీఎఫ్‌ఓ సరికొత్త మొబైల్‌ యాప్‌ను తీసుకురానుందని, ఇందులో సభ్యులు యూపీఐ ద్వారా సొమ్మును వెనక్కి తీసుకోవచ్చని, పాస్‌బుక్‌ బ్యాలెన్స్‌ వంటి ఇతర సేవలను కూడా పొందొచ్చని వెల్లడించాయి. కొత్త మొబైల్‌ యాప్‌లో బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసేందుకు ఎంత ఈపీఎఫ్‌ మొత్తం అందుబాటులో ఉంది అనే వివరాలను చందాదారులు తెలుసుకోవచ్చు.

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) చందాదారులు లావాదేవీలను పూర్తి చేయడానికి, వారి బ్యాంక్‌ ఖాతాలకు నిధులు భద్రంగా వెళ్లడానికి లింక్‌ చేసిన యూపీఐ పిన్‌ను వినియోగించాలి. సేవలను మెరుగుపరచడానికి, సాంకేతిక లోపాలను తొలగించడానికి ప్రస్తుతం 100 డమ్మీ ఖాతాలతో ఈపీఎఫ్‌ఓ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ యాప్‌ను తీసుకొచ్చేందుకు కార్మిక శాఖ సన్నద్ధమవుతోంది.

ఈపీఎఫ్‌ చందాదారులు ఇప్పటికే పీఎఫ్‌ మొత్తాలను ఉపసంహరించేందుకు సంబంధించి ఈపీఎఫ్‌ఓ పలు మార్పులు చేపట్టింది. ఆటో సెటిల్‌మెంట్‌ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచింది. దీనివల్ల మానవ ప్రమేయం లేకుండా కేవలం 3 రోజుల్లోనే నగదు ఖాతాకు చేరుతోంది. దీంతో పాటు పాక్షిక ఉపసంహరణలకు సంబంధించి గతంలో ఉన్న 13 రకాల సంక్లిష్ట నిబంధనలను సరళీకృతం చేశారు. అత్యవసర (అనారోగ్యం, విద్య, వివాహం), ఇంటికి సంబంధించిన అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే 3 విభాగాలుగా వర్గీకరించారు.  ఈ కేటగిరీల కింద అర్హత కలిగిన బ్యాలెన్స్‌లో (కనీస నిల్వ అనంతరం)  100 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 25 శాతం మొత్తాన్ని కనీస నిల్వగా ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. ఈ కనీస మొత్తం (25 శాతం) మినహాయించగా.. మిగతా 75 శాతం నుంచి అనుమతించిన క్లెయిమ్‌ల సంఖ్య మేరకు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)