Talliki Vandanam Scheme :
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు, వారి తల్లులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. స్కూళ్లుకు వెళ్లే ప్రతి చిన్నారికి ఆర్థిక భరోసా కల్పించే తల్లికి వందనం పథకం నిధులను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ రూ.10,120.78 కోట్ల నిధుల విడుదలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుంది. ఏడాదికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.13,000 జమ కానుండగా, పాఠశాలల మౌలిక వసతులు, నిర్వహణ కమిటీ కోసం రూ.2,000 కేటాయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. మొత్తం 42.70 లక్షల మంది తల్లుల ఖాతాల్లో ఈ నగదు జమ కానుంది.

రెండు విడతల్లో వెరిఫికేషన్ – అర్హులైన వారి తుది జాబితాను ప్రదర్శిస్తారు :
ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలును పారదర్శకంగా చేపట్టేందుకు లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ పథకం రెండు విడతలుగా అమలు చేయనున్నారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలల్లో కొనసాగుతున్న విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల వెరిఫికేషన్ పూర్తయింది. అర్హులైన వారి తుది జాబితాను ఈ నెల 22న స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదే రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నేరుగా తల్లుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయబడుతుంది.
రెండో విడత నగదు జమ :
2026-2027 విద్యాసంవత్సరంలో కొత్తగా ఒకటో తరగతిలో చేరిన పిల్లలు, అలాగే స్కూళ్లు మారి 9వ తరగతిలో చేరిన వారు, టెన్త్ పూర్తి చేసుకుని ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థుల వివరాల నమోదు ఇంకా కొనసాగుతోంది. వీరందరి డేటాను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హతను బట్టి ఆగస్టు 30వ తేదీ నాటికి వారి తల్లుల ఖాతాల్లో కూడా ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు. కొత్తగా చేరిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది.
తల్లిదండ్రులకు అధికారుల కీలక సూచన :
తల్లికి వందనం నిధులను ఈ నెల 22న నిధులు విడుదలవుతున్న నేపథ్యంలో తల్లులందరూ తమ బ్యాంకు ఖాతాలు రన్నింగ్‌లో ఉండేలా చూసుకోవాలని, కేవైసీ సమస్యలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.