August 28, 2026

India Post Jobs రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా GDS, BPM, ABPM, డాక్ సేవక్ పోస్టుల్లో 25 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు.అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

India Post దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నియామకాల్లో అభ్యర్థులను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ వంటి హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జులై 2026 సెషన్‌లో 25 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 2, 2026వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదే ఏడాది జనవరి సెషన్‌కు సంబంధించి ఇండియా పోస్ట్ 28,740 GDS ఖాళీలను భర్తీ చేసిన విషయం తెలిసిందే.

  • గ్రామీణ డాక్ సేవక్ (GDS)
  • బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)
  • అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)
  • డాక్ సేవక్

పదో తరగతిలో మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత పోస్టల్ సర్కిల్‌కు చెందిన స్థానిక భాష చదివి ఉండాలి. ఏపీ, తెలంగాణ పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి వరకు తెలుగు భాషను చదివి ఉండటం తప్పనిసరి. అదనంగా అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం కూడా అవసరం.

  • ఆన్‌లైన్ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ : ఆగస్ట్‌ 31, 2026 నుంచి సెప్టెంబర్ 19, 2026 వరకు
  • ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు : సెప్టెంబర్‌ 2, 2026 నుంచి సెప్టెంబర్‌ 21, 2026 వరకు
  • దరఖాస్తు సవరణకు అవకాశం : సెప్టెంబర్‌ 23, 2026 నుంచి సెప్టెంబర్‌ 24, 2026 వరకు

అభ్యర్ధుల వయోపరిమితి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌ఐలన్‌ విధానంలో సెప్టెంబర్ 21, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలవారీ BPM పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM/డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ నియామకాల్లో అభ్యర్థులకు సాధారణంగా రాత పరీక్ష నిర్వహించకుండా పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతారు. మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని SMS, ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా తెలియజేస్తారు.

దరఖాస్తు ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్ధులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ వేర్వేరు పోస్టల్ సర్కిళ్లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు పోస్టల్ సర్కిల్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error

Enjoy this blog? Please spread the word :)