EPS Pension Scheme Big Update :
EPS ఉద్యోగుల పింఛను నిధి పథకం ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. కనీస పింఛను మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని ఈపీఎస్-95 పథకానికి చెందిన వేలమంది పింఛనుదారులు (EPS 95 pension) ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని తాజాగా పార్లమెంట్‌లోనూ ఓ సభ్యుడు లేవనెత్తారు. అయితే, పెన్షన్ పెంచే ప్రతిపాదనేదీ లేదని తాజాగా కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు. ఇందుకు ఆమె వివరణ కూడా ఇచ్చారు. (EPS Minimum Payout).

ఉద్యోగుల పింఛను నిధికి మూలధనం అనేది వేతనాల్లో యజమాని 8.33 % వాటాతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పడుతుంది. ఆ లెక్కల నుంచి వచ్చిన ఆదాయంతోనే ఈ స్కీమ్ కింద అన్ని ప్రయోజనాలు అందిస్తున్నాం. ఏటా ఈ నిధిని అంచనా వేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఆ మూల్యాంకనం ప్రకారం ఈ పింఛను ఫండ్ లోటులో ఉంది. దీనికి సరైన రిటర్నులు రానందున.. ప్రస్తుత నిబంధనల ప్రకారం కనీస పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తోంది’’ అని మంత్రి వివరించారు. దీంతో ఇప్పట్లో ఈపీఎస్ కనీస పింఛన్‌ను పెంచే అవకాశాలు కన్పించట్లేదు.
EPS SCHEME అంటే ఏంటి?
EPS అనేది EPFO లో ఒక భాగం. EPFO లో సభ్యులైన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే, ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా పదవీవిరమణ తర్వాత నెలవారీ పింఛను పొందొచ్చు. ఉద్యోగి మరణించిన తర్వాత కూడా నామినీకి ఈ పింఛను వస్తుంది. ఉద్యోగి, సంస్థ 12% చొప్పున ఉద్యోగి వేతనానికి సమానమైన మొత్తాన్ని ప్రతి నెలా ఈపీఎఫ్‌లో జమ చేస్తారు. సంస్థ వాటా అయిన 12 % లో 8.33 % EPS కి వెళ్తుంది. మిగతా 3.67 % EPF కి చేరుతుంది. అంటే, EPS కోసం ఉద్యోగి పనిచేసే సంస్థ కాంట్రిబ్యూట్ చేస్తుంది.
EPS SCHEME ప్రయోజనాలివే :
- EPFO పింఛను నెలకు కనీసం రూ.1,000 లభిస్తుంది. గరిష్ఠంగా రూ.7,500 పొందే వీలుంది. (ఇప్పుడు కనీస మొత్తాన్ని రూ.7,500కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే గరిష్ఠ పింఛను మొత్తం కూడా పెరుగుతుంది)
- ఉద్యోగి 58 ఏళ్ల తర్వాత లేదా పదవీ విరమణ పొందిన తర్వాత ఈ పింఛనును పొందొచ్చు. 50 ఏళ్ల వయసు నుంచే ముందస్తు పింఛను అందుకునే సౌకర్యమూ ఉంది.
- ఉద్యోగి చనిపోతే వారి భాగస్వామికి ఈ పింఛను అందుతుంది. ఒకవేళ భాగస్వామి లేకపోతే పిల్లలు 25 ఏళ్లు వచ్చేవరకు ఈ పింఛను పొందొచ్చు.
- భార్య లేదా భర్తను కోల్పోయినవారు తిరిగి పెళ్లి చేసుకుంటే కేవలం పిల్లలకు మాత్రమే (25ఏళ్లు వచ్చేంతవరకు) ఈ పింఛను పొందే వీలుంది.
- పిల్లలు దివ్యాంగులైతే.. జీవితకాలం ఈ పింఛను అందుకోవచ్చు.
- ఈ పింఛను క్లెయిమ్ చేసుకునేందుకు ఈపీఎఫ్‌వో నుంచి పెన్షన్ సర్టిఫికెట్ పొందడం అవసరం.