Indian Railways :
ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే (Indian Railways) ఇటీవల కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణానికి అరగంట ముందు కూడా బోర్డింగ్ పాయింట్ (Boarding point) మార్చుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. గతంలో ఇలా ఎక్కాల్సిన స్టేషన్ మార్చుకోవాలంటే 24 గంటల ముందు మాత్రమే సాధ్యమయ్యేది. అనుకోని కారణాల వల్ల సంబంధిత స్టేషన్‌లో రైలు అందుకోలేమన్న అనుమానం ఉన్నప్పుడు 30 నిమిషాల ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవడం ద్వారా ఆదరబాదరగా ట్రైన్ ఎక్కాల్సిన అవసరం తప్పుతుంది. ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా ఈ సదుపాయం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

ఎలా మార్చుకోవాలి?
ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అందులో మై అకౌంట్> మై ట్రాన్సాక్షన్> బుక్డ్ టికెట్ హిస్టరీలోకి వెళ్లాలి. అందులో టికెట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఆపై ‘చేంజ్ బోర్డింగ్ పాయింట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ట్రైన్ వెళ్లే రూట్‌లో మీకు ఏది సౌకర్యంగా అనినిపిస్తే ఆ స్టేషన్‌ను బోర్డింగ్ పాయింట్‌గా ఎంపిక చేసుకోవచ్చు. ఆపై మీకో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో టికెట్ తీసుకుని ఉంటే దగ్గర్లోని రైల్వే కౌంటర్‌కి వెళ్లి టికెట్, గుర్తింపు కార్డు చూపించి మార్చుకోవచ్చు.
సెకండ్ ఛార్ట్‌లోనే …!
బోర్డింగ్ పాయింట్‌కు సంబంధించిన సవరించిన నిబంధనల ప్రకారం.. ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ పేరు ఇకపై ఫస్ట్ ఛార్ట్‌లో కనిపించదు. ట్రైన్ బయల్దేరడానికి కాసేపటి ముందు రూపొందించే సెకండ్ రిజర్వేషన్ ఛార్టులో మాత్రమే ఆ వివరాలు కనిపిస్తాయి. కన్ఫామ్ లేదా ఆర్‌ఏసీ (RAC) ఉన్నప్పుడు మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకోవడానికి వీలుంటుంది. వెయిట్ లిస్ట్ ప్రయాణికులకు ఈ వెసులుబాటు లేదు. ఒక టికెట్‌కు ఒకసారి మాత్రమే బోర్డింగ్ పాయింట్ మార్చుకొనే వెసులుబాటు ఉంది.